ఎదుగుదల లోపాలున్న చిన్నారుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి 'బాల భరోసా' కార్యక్రమం అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఏర్పాటు చేసిన బాల భరోసా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శారీరక ఎదుగుదల నెమ్మదిగా ఉన్న చిన్నారుల ఆరోగ్య ఉన్నతికి బాల భరోసా కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
అంగన్వాడీలలో చేరిన విద్యార్థుల్లో ఎదుగుదల లోపాలు గుర్తించిన వారిని బాల భరోసా కేంద్రాల్లో చేర్పించి, వారికి అవసరమైన ప్రత్యేక వైద్య సేవలు అందిస్తామని కలెక్టర్ వివరించారు. ఒకవేళ అత్యుత్తమ వైద్య సేవలు అవసరమైతే, పై స్థాయి ఆసుపత్రులలో చికిత్స అందజేస్తామని తెలిపారు.
చిన్నారులలో అనారోగ్య సమస్యలు, ఎదుగుదల లోపాలను సకాలంలో గుర్తించడం ద్వారా వారిని త్వరితగతిన ఆరోగ్యవంతులుగా మార్చవచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ కేంద్రాల ద్వారా చిన్నారులకు స్వాంతన చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్, సంక్షేమ అధికారి వినూత్న, ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, ఆర్ఎంఓ రమేష్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.








