కుబీర్, 2026-08-31
ప్రజలందరికీ ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా కార్యకర్తల ఆరోగ్యం, ఆర్థిక భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని , తెలంగాణ ఆశా కార్యకర్తల సంఘాల నాయకులు ఆరోపించారు. కుబీర్ మండలం సిర్పెల్లి గ్రామానికి చెందిన ఒక ఆశా కార్యకర్త తీవ్ర రక్తహీనతతో మృతి చెందడం ఈ సమస్యను మరోసారి తెరపైకి తెచ్చింది.
ప్రజలందరికీ ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా కార్యకర్తల ఆరోగ్యం, ఆర్థిక భద్రత, కుటుంబ భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ఇది సరికాదని జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్ అన్నారు. కుబీర్ మండలం సిర్పెల్లి గ్రామానికి చెందిన ఒక ఆశా కార్యకర్త తీవ్ర రక్తహీనతతో అనారోగ్యానికి గురై మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే ఆశా కార్యకర్తల ఆరోగ్యాన్ని పర్యవేక్షించే వ్యవస్థ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు.
ఆశా కార్యకర్త మృతి చెందినప్పుడు ఆమె కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదా, లేక తోటి ఆశా కార్యకర్తలా అని బొమ్మెన సురేష్ ప్రశ్నించారు. తలా కొంత అంటూ తోటి ఆశా కార్యకర్తల వద్ద డబ్బులు వసూలు చేసి కుటుంబానికి అందించడం మానవీయ స్పందన కావచ్చు, కానీ అది ప్రభుత్వ బాధ్యతకు ప్రత్యామ్నాయం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే తక్కువ పారితోషికంతో, అధిక పని భారంతో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలపైనే మరో ఆర్థిక భారం మోపడం అన్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజలకు ఆరోగ్య సేవలు అందించే ఆశా కార్యకర్తలకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు, ఉచిత వైద్యం, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, సామాజిక భద్రత కల్పించాలని తెలంగాణ ఆశా కార్యకర్తల యూనియన్ జిల్లా కార్యదర్శి పి. గంగామణి డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ, ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.18,000 చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రతి ఆశా కార్యకర్తకు క్రమం తప్పకుండా ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు పూర్తి వైద్య సహాయం అందించాలని ఆమె అన్నారు.
అనారోగ్యం లేదా ప్రమాదంతో మృతి చెందిన ఆశా కార్యకర్త కుటుంబానికి ప్రభుత్వ పరిహారం అందించాలని, కుటుంబానికి పెన్షన్, సామాజిక భద్రత కల్పించాలని పి. గంగామణి కోరారు. పని భారం తగ్గించి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, మరణానంతర ఖర్చుల కింద రూ.50,000 చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రజలకు ఆరోగ్యం ఆశా కార్యకర్తలకు అనారోగ్యమా అని ప్రశ్నించిన చిన్న సైదులు, సిర్పెల్లిలో మృతి చెందిన ఆశా కార్యకర్త కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించి, కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఆశా కార్యకర్తల ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి, వారికి ఆరోగ్య, ఉద్యోగ, సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ఆశా కార్యకర్తలు దానం మీద బతికే కార్యకర్తలు కాదని, ప్రజారోగ్య వ్యవస్థకు వెన్నెముక అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జి. కిషన్ కుమార్, జిల్లా కోశాధికారి బి. లలిత, ఆశా కార్యకర్తల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సుజాత, మండల అధ్యక్షులు సులోచన, తదితరులు పాల్గొన్నారు.












