తెలుగు వెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో ప్రముఖ నాటక రచయిత, రంగస్థల నాయకుడు శ్రీపాద కుమార శర్మ గారికి ఘన సన్మానం జరిగింది. రంగస్థల రంగంలో విశేష సేవలు అందించిన ఆయనను సమాఖ్య అధ్యక్షులు చంద్రశేఖర్, ఆయన సహోదరుడు ప్రభు శాలువా కప్పి, మెమొంటో అందజేశారు.
సమాఖ్య అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ, "ఇలాంటి కళాకారులు సమాజానికి అరుదైన సంపద. రంగస్థలానికి జీవితాన్ని అంకితం చేసిన కళాతపస్వి శ్రీపాద కుమార శర్మ గారు అందరికీ ఆదర్శప్రాయుడు" అని పేర్కొన్నారు.
ఇందూరు ముద్దుబిడ్డగా పేరుపొందిన శ్రీపాద కుమార శర్మ గారు రంగస్థల రంగంలో అంచెలంచెలుగా ఎదిగి ప్రత్యేక గుర్తింపు పొందారని, భవిష్యత్తులో కూడా ఆయన సేవలను వినియోగించుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సన్మాన కార్యక్రమంలో పలువురు కళాకారులు, సాహిత్యవేత్తలు, సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.








