విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాల్సిన ఉపాధ్యాయులు పాఠశాలలకు ఆలస్యంగా వస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో, పాఠశాల విద్యాశాఖ కఠిన నిబంధనలను అమలు చేయనుంది. ఆలస్యంగా విధులకు హాజరయ్యే వారిపై చర్యలు తీసుకునేందుకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ (FRS) ను తప్పనిసరి చేసింది.
పాఠశాల విద్యాశాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం, ఉద్యోగులు ఉదయం 10.40 గంటలలోపు FRS లో హాజరు నమోదు చేసుకోవాలి. 10.41 నుండి 11.30 గంటల మధ్య ఆలస్యంగా వచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. నెలలో మూడు సార్లు ఇలా ఆలస్యంగా వస్తే, ఒక క్యాజువల్ లీవ్ (CL) కోత విధిస్తారు.
అలాగే, సాయంత్రం 5 గంటల తర్వాతే కార్యాలయాలు వదిలి వెళ్లాలని సూచించారు. 4 గంటలలోపు కార్యాలయం వదిలి వెళ్ళిన వారిని ఒక పూట ఆఫ్‌డే లేదా CL గా పరిగణిస్తారు. సాయంత్రం 4 నుండి 5 గంటల మధ్య వెళ్ళినా డుమ్మాగా పరిగణించి, వరుసగా మూడు రోజులు ఇలా జరిగితే ఒక CL కోత విధిస్తారు. శాఖాపరమైన పని నిమిత్తం బయటకు వెళ్లాల్సి వస్తే సంబంధిత అధికారి అనుమతి తప్పనిసరి.
FRS హాజరును నెలవారీ లెక్కల్లో పరిగణనలోకి తీసుకుంటారు. ఉద్యోగులకు ఏడాదికి 15 CLలు, 30 ELలు అందుబాటులో ఉంటాయి. ఆలస్యంగా హాజరైతే ముందుగా CLల నుండి, ఆ తర్వాత ELల నుండి కోత విధిస్తారు. కార్యాలయ సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, ఎస్టాబ్లిష్మెంట్ అధికారులు ఉద్యోగుల హాజరు, సెలవుల ఖాతాలను నిర్వహించి, ప్రతి నెలా 20వ తేదీలోపు అకౌంట్స్ ఆఫీసర్‌కు నివేదిక సమర్పించాలి.
విద్యాశాఖ డైరెక్టరేట్‌లోని బోధనేతర సిబ్బందికి FRS హాజరు తప్పనిసరి చేయగా, ఇదే నిబంధనలను ఉపాధ్యాయులకు కూడా వర్తింపజేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో లక్ష మందికి పైగా టీచర్లు ఉన్నారు. వీరిలో కొందరు తరచుగా విధులకు గైర్హాజరవుతున్నారని, దీనిపై ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని భావిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఆలస్యంగా వచ్చిన టీచర్ల CL, EL లకు కోత విధించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.












