నిర్మల్, జులై 18
నిర్మల్ పట్టణంలో గత కొన్ని వారాలుగా విజయవంతంగా కొనసాగుతున్న సాయి సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం తాజాగా లింగారెడ్డి నివాసంలో ఘనంగా జరిగింది. సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
గత కొన్ని వారాలుగా నిర్వహిస్తున్న సాయి సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగానే పట్టణంలోని వెంకటాపూర్ లో గల లింగారెడ్డి నివాసంలో శనివారం సాయంత్రం సాయి సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో సాయి పాదుకలు, సాయి చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి లింగారెడ్డి నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భాగంగా రామచందర్ మాస్టర్ నేతృత్వంలోని భజన బృందం ఆలపించిన ఆధ్యాత్మిక గీతాలు ఆహుతులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి.
ఈ సందర్భంగా సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి శనివారం సాయి భక్తుల ఇళ్లల్లో వారి కోరిక మేరకు సాయి సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. గత కొన్ని వారాలుగా నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు.
భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఇళ్లల్లో, అపార్ట్మెంట్లలో సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకొని సాయి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవాసమితి సభ్యులు ఉప్పుల నందు, కందుల పండరి, రాంచందర్ మాస్టర్, వర్మ, రాజు, సత్యం, కైలాసపతి, నారాయణ రెడ్డి, మహిళలు రేఖ, లక్ష్మి, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.












