మండల కేంద్రమైన ముథోల్ లో నూతనంగా నిర్మించిన దత్త మందిరంలో శ్రీ దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్టపన ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. మూడు రోజుల పాటు సాగిన ఈ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
ముథోల్ లోని తహసిల్ కార్యాలయం వెనుక గల నాందేడ్ గల్లిలో నూతనంగా నిర్మించిన దత్త మందిరం, శ్రీ దత్తాత్రేయ స్వామి విగ్రహం ప్రాణ ప్రతిష్టపన మహోత్సవం కన్నుల పండువగ జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరిగింది.
మూడు రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు విగ్రహ ఊరేగింపు, రెండవ రోజు మందిర ప్రారంభం, దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్టపన ఉత్సవాలు, చివరి రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తుల సంఖ్య గణనీయంగా ఉంది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహారాష్ట్ర ప్రభుత్వ స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్ సాయినాథ్ మహారాజ్ వస్మత్కర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పరిశుభ్రత, మొక్కలు పెంచడం, విద్య, మూఢనమ్మకాల నిర్మూలన, యువతకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం, భూగర్భ జలాల పెంపు, మహిళల ఉన్నతి, కాలుష్య నివారణ వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు.
రక్తదాన శిబిరాలు నిర్వహించడం, రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి చేయడం వంటి సామాజిక బాధ్యతలను చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక జ్ఞానంతోనే ఉన్నతమైన జీవితాన్ని పొందవచ్చని, స్థానిక భక్తుల ఐక్యతతో ఈ మందిర నిర్మాణం, ప్రాణ ప్రతిష్ట మహోత్సవం విజయవంతం కావడం ఆనందంగా ఉందని వస్మత్కర్ పేర్కొన్నారు.












