నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని కదిలే పాప హరీశ్వర ఆలయ ప్రాంగణంలో 11వ నుండి 13వ శతాబ్దాల మధ్యకాలానికి చెందిన అరుదైన నటరాజ తాండవ శివుని శిల్పాన్ని చరిత్ర పరిశోధకులు గుర్తించారు.
ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు డాక్టర్ తుమ్మల దేవరావు ఈ అపురూప శిల్పాన్ని కనుగొన్నారు. ఇది శైవ శిల్పకళలో ఒక విశిష్ట కళాఖండంగా నిలుస్తుందని ఆయన తెలిపారు. లలిత ముద్రలో ఆనంద తాండవం చేస్తున్న శివుని రూపాన్ని ఈ విగ్రహం అత్యంత సుందరంగా ఆవిష్కరిస్తుంది.
విగ్రహానికి బహుభుజాలు ఉండగా, వివిధ చేతులలో డమరుకం, అగ్ని, అభయముద్ర, గజహస్త ముద్రలు చెక్కబడి ఉన్నాయి. తలపై గంగా, చంద్రుడు, సర్పాలతో కూడిన జటాజూటం, మెడలో హారాలు, కటి సూత్రం, పుష్పాభరణాలు, సర్పాల అలంకరణలు శిల్పకళా నైపుణ్యాన్ని చాటుతున్నాయి. మెడ వెనుక భాగంలో అనుచర గణాల రూపాలు కూడా ఉన్నాయి.
కుడి కాలిపై నిలబడి, ఎడమ కాలును ఎత్తి నృత్య భంగిమలో ఉన్న ఈ విగ్రహం, లాస్య సౌందర్యం మరియు ఉగ్రరూప భావవ్యక్తీకరణల కలయికతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కపాలాల రూపకల్పన ద్వారా శైవ తత్వంలోని రౌద్ర, ఆనంద స్వరూపాలను శిల్పి ప్రతిబింబించినట్లు తెలుస్తోంది.
విగ్రహ లక్షణాలు, శిల్ప శైలిని బట్టి ఇది 11వ నుండి 13వ శతాబ్దాల మధ్యకాలానికి చెందినదని భావిస్తున్నారు. కళ్యాణి చాళుక్యుల చివరి దశలో లేదా కాకతీయుల ప్రారంభ కాలంలో ఈ శిల్పాన్ని మలచి ఉండవచ్చని డాక్టర్ దేవరావు అభిప్రాయపడ్డారు.












