నిజామాబాద్ జిల్లా బాల్కొండలో కొలువైన శ్రీ నిమిషంభ దేవి ఆలయంలో ఆదివారం అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, హోమాలు, అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
శ్రీ నిమిషంభ దేవి ఆలయంలో ఉదయం అమ్మవారికి అభిషేకం, గణపతి, చండి, రుద్ర హోమాలు నిర్వహించారు. అనంతరం ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుండి వచ్చిన మహిళా భక్తులు అమ్మవారికి ఒడి బియ్యాలు సమర్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
జన్మదినోత్సవం సందర్భంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారికి కానుకలు సమర్పించారు. మెట్‌పల్లికి చెందిన ధనలకొట నర్సయ్య వర్మ - విజయలక్ష్మి దంపతులు, మైత్రేయ ఋషి గోత్రానికి చెందినవారు, ఆర్థిక సహాయం అందించి అన్నదానం చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ సేవకులు బి. ఆర్. నర్సింగ్ రావు మాట్లాడుతూ, అన్నదానం గొప్ప పుణ్యమని, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం దేవుని సేవతో సమానమని భక్తులకు సూచించారు. మానవ జీవితంలో సంపాదించిన దానికంటే, దైవం కోసం చేసిన సేవ ముఖ్యమని ఆయన ఉద్బోధించారు.
భవిష్యత్ కార్యక్రమాల గురించి వివరిస్తూ, జూన్ 2026 మొదటి శుక్రవారం నుండి డిసెంబర్ 2026 వరకు ప్రతి నెల మొదటి శుక్రవారాల్లో అన్నదానం చేయాలనుకునే కుటుంబాలు తమ వివరాలను 9666759297 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని ఆలయ సేవకులు కోరారు. హైదరాబాద్ నుండి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారిపై ఉన్న బాల్కొండకు చేరుకోవచ్చు. సమీపంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కలదు.












