లక్నో (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 23
అయోధ్య బాల రాముడి ఆలయ నిర్మాణంలో కీలక నిర్ణయాలన్నీ ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి నృపేంద్ర మిశ్రా ఆధ్వర్యంలోనే జరిగాయని, కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనేనని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఒక లేఖలో పేర్కొన్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ తొమ్మిది పేజీల లేఖ, రామమందిర నిర్మాణంలో విరాళాల వివాదం నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది.
అయోధ్య బాల రాముడి ఆలయ నిర్మాణంలో కీలక నిర్ణయాలన్నీ ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి నృపేంద్ర మిశ్రా ఆధ్వర్యంలోనే జరిగాయని, కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనేనని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఒక లేఖలో పేర్కొన్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ తొమ్మిది పేజీల లేఖ, రామమందిర నిర్మాణంలో విరాళాల వివాదం నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే నెల 3వ తేదీన ట్రస్ట్ సమావేశమై సీఈఓను ఎంపిక చేస్తుందనే వార్తల నేపథ్యంలో ఈ లేఖ బయటకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
విరాళాల వివాదం, రాజీనామా
గతంలో రామమందిర నిర్మాణానికి సంబంధించిన విరాళాల సేకరణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో చంపత్ రాయ్ జూన్ 26న తన ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. అయితే, ఈ కుంభకోణంపై విచారణ జరిపిన సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఆయనకు క్లీన్చిట్ ఇచ్చింది. గత కొంతకాలంగా అయోధ్యలోనే ఉంటూ సాధువులు, మత పెద్దలను కలుస్తున్న చంపత్ రాయ్, మరోసారి ట్రస్ట్‌లో కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత నెల 6న జరిగిన ట్రస్ట్ సమావేశంలో ఆయన రాజీనామాను ఆమోదించారు. ఈ నెల 18న ఆయన రాసిన లేఖ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
మిశ్రాదే సర్వాధికారం
తన లేఖలో చంపత్ రాయ్, ట్రస్ట్‌లోని పదిహేను మంది సభ్యుల గురించి ప్రస్తావించారు. ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్‌గా నృపేంద్ర మిశ్రా నియమితులయ్యారని, ఆయన సూచన మేరకే ఆలయ నిర్మాణానికి ఎల్ అండ్ టీ సంస్థను, ఇతర భవనాల రూపకల్పన, నిర్మాణానికి నోయిడాకు చెందిన డిజైన్ అసోసియేట్ సంస్థను ఎంపిక చేశారని తెలిపారు. మిశ్రా తన అనుయాయులైన కొందరు వ్యక్తులను నిర్మాణ కమిటీలోకి తీసుకొచ్చారని, వీరిలో కొందరు అరుదుగా మాత్రమే అయోధ్యను సందర్శించారని పేర్కొన్నారు. కమిటీలోని మరో సభ్యుడితో భద్రతా సంబంధిత విషయాలపై సంప్రదింపులు జరిపేవారని తెలిపారు. ఎన్బీసీసీ మాజీ ఛైర్మన్ అనూప్ మిట్టల్, మిశ్రాతో కలిసి కమిటీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరయ్యేవారని, నిర్మాణ సంబంధమైన నిర్ణయాలన్నింటికీ మిశ్రా ఎప్పుడూ తనను తాను ముఖ్యుడిగా భావించుకునేవారని చంపత్ రాయ్ వివరించారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి మిశ్రాయే కారణమని, కరోనా మహమ్మారి సమయంలో 2020 జూన్‌లో ప్రారంభమైన ఈ భారీ రాతి ఆలయ నిర్మాణం 2026 జూన్‌లో పూర్తయిందని తెలిపారు. సమస్యలు ఎదురైనప్పుడు మిశ్రా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నిపుణులను రప్పించి, వారి సలహా మేరకు వాటిని పరిష్కరించేవారని, చాలా మంది నిపుణులు సేవాభావంతోనే సలహాలు ఇచ్చారని, ఎలాంటి పారితోషికం తీసుకోలేదని పేర్కొన్నారు.












