హిందూ ధర్మశాస్త్రం ప్రకారం, 2026వ సంవత్సరంలో మే 17వ తేదీ నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం కానుంది. ఈ మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. సాధారణంగా శుభకార్యాలకు నిషిద్ధమైనప్పటికీ, ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ఇది అత్యంత విశిష్టమైన కాలంగా పరిగణించబడుతుంది.
అధిక మాసం అంటే ఏమిటి?
అధిక మాసం అనేది చాంద్రమానం, సౌరమానం మధ్య వ్యత్యాసాన్ని సరిచేయడానికి ప్రతి 33 నెలలకు ఒకసారి ఏర్పడుతుంది. ఈ మాసంలో సూర్య సంక్రమణం జరగదు. పురాణాల ప్రకారం, శ్రీమహావిష్ణువు ఈ మాసానికి అధిపతిగా మారి, దీనికి 'పురుషోత్తమ మాసం' అనే పేరును ఇచ్చారు. అందుకే ఈ నెలలో విష్ణుమూర్తి ఆరాధనకు విశేష ప్రాధాన్యత ఉంటుంది.
పురుషోత్తమ మాసం ప్రాశస్త్యం
శాస్త్రాల ప్రకారం, అధిక మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి లౌకిక శుభకార్యాలు చేయరాదు. అయితే, నామస్మరణ, జపాలు, దానధర్మాలు వంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలు చేయడం వల్ల అనంతమైన ఫలితాలు లభిస్తాయని నమ్మకం. ముఖ్యంగా ఇష్టదైవం ఆరాధన, గాయత్రీ మంత్ర జపం, నరసింహ కవచ పఠనం వంటివి మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి.
అధిక మాసంలో చేయాల్సినవి, చేయకూడనివి
ఈ మాసంలో పండ్లు, పిండి వంటలు, స్వయంపాకం వంటివి దానం చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ద్వాదశి, పౌర్ణమి, అమావాస్య తిథుల్లో చేసే దానాలు విశేష ఫలితాలనిస్తాయి. పితృదేవతల సద్గతి కోసం సంధ్యాసమయంలో దీపం వెలిగించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు, నవగ్రహ హోమాలు, శాంతిపూజలు వంటివి ఈ మాసంలో ఎక్కువగా నిర్వహిస్తారు.
ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత
అధిక మాసం అనేది భక్తికి, ఆధ్యాత్మిక చింతనకు కేటాయించాల్సిన సమయం. బాహ్య ఆడంబరాలకు దూరంగా ఉంటూ, అంతరంగంలో భగవంతునిపై దృష్టి సారించడానికి ఇది ఒక చక్కని అవకాశం. 2026 మే 17 నుంచి ప్రారంభమయ్యే ఈ పురుషోత్తమ మాసాన్ని సద్వినియోగం చేసుకోవాలని భక్తులకు సూచించారు.












