నిర్మల్ జిల్లా, సారంగాపూర్ లోని అడెల్లి శ్రీ మహా పోచమ్మ అమ్మవారి ఆలయానికి రూ. 21 లక్షల విలువైన వెండి మకర తోరణాన్ని దాతలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా మాజీ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దాతల సహకారంతో ఆలయాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.
సారంగాపూర్ మండలకేంద్రానికి చెందిన ఇండెన్ గ్యాస్ ఏజెన్సీ యజమాని పదిరె కవిత వేణు చందర్ రెడ్డి దంపతులు ఈ భారీ విరాళాన్ని అమ్మవారికి అందించారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం, ఆలయ పండితులు దంపతులకు ఆశీర్వచనాలు అందించారు.
మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, తాను మంత్రిగా ఉన్నప్పుడు రూ. 7 కోట్లతో ఆలయాన్ని కృష్ణ శిలాలతో పునర్నిర్మాణం చేయించినట్లు గుర్తు చేశారు. ఆలయాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడానికి ఆలయాల అభివృద్ధి అవసరమని ఆయన తెలిపారు.
ఆలయ చైర్మన్ సింగం భోజగౌడ్, ఈఓ భూమయ్య లు విరాళం అందించిన దంపతులను శాలువాతో సన్మానించి, అమ్మవారి ప్రతిమను బహూకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పారిశ్రామికవేత్తలు, స్థానిక నాయకులు, సర్పంచులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.












