తిరుపతి, 2026-06-05
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు తహసిల్దార్ కార్యాలయం డిప్యూటీ తహసిల్దార్ జీవన్ కుమార్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సస్పెండ్ చేశారు. భూమి వివాదంలో అక్రమంగా లంచం డిమాండ్ చేయడం, ప్రజా ప్రతినిధులపై నిరాధార ఆరోపణలు చేయడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు తహసిల్దార్ కార్యాలయం డిప్యూటీ తహసిల్దార్ జీవన్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. 0.09 సెంట్ల భూమికి సంబంధించి రూ.3,00,000 అక్రమ లంచం డిమాండ్ చేసినట్లు, అలాగే శెట్టిపల్లి భూములకు సంబంధించి ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ పై నిరాధార అసత్య ఆరోపణలు చేసిన ఒక ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో బహిర్గతమైంది.
విచారణలో తేలిన వాస్తవాలు
ఈ విషయంపై శ్రీకాళహస్తి తిరుపతి రెవెన్యూ డివిజనల్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా సదరు ఆడియో రికార్డింగ్ ను పరిశీలించి, అందులోని వాయిస్ తొట్టంబేడు డిప్యూటీ తహసిల్దార్ జీవన్ కుమార్ దిగా గుర్తించారు. అధికారులు సమర్పించిన నివేదికల ఆధారంగా జీవన్ కుమార్ ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
శాఖాపరమైన చర్యలు
అలాగే ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ కింద జీవన్ కుమార్ పై మూడు అవయోగాలను నమోదు చేసి శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు.












