కుంటాల మండలంలో చోటుచేసుకున్న మొక్కజొన్న సంచుల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరొకరు పరారీలో ఉన్నారు.
వెంకుర్ గ్రామ శివారులో రైతు మగ్గిడి నారాయణ పొలంలో నిల్వ చేసిన మొక్కజొన్న సంచులను ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి దుండగులు అపహరించారు. బాధితుడి ఫిర్యాదుతో కుంటాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఆదేశాల మేరకు, ఏఎస్పీ రాజేష్ మీనా పర్యవేక్షణలో ప్రత్యేక బృందం సీసీ కెమెరా ఫుటేజ్, కాల్ డీటైల్స్ ఆధారంగా నిందితులను గుర్తించింది.
విచారణలో భాగంగా నిందితుల వద్ద నుంచి రూ.75 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో షేహెబాజ్ అహ్మద్, షేక్ అతీఫ్, మొహమ్మద్ సాహిల్ ఉద్దిన్, షేక్ జలాల్ అలియాస్ అర్బాజ్ ఉన్నారు. షేక్ నోమన్ అలియాస్ మన్నాన్ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించారు.
కేసును త్వరితగతిన ఛేదించిన భైంసా రూరల్ ఇన్స్పెక్టర్ ఎం. ప్రవీణ్ కుమార్, కుంటాల ఎస్సై సి. అశోక్, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.












