దుమ్ముగూడెం మండలంలో ప్రభుత్వ అనుమతులు పొందిన మద్యం దుకాణాల కంటే అక్రమ బెల్ట్ షాపులే అధికంగా నడుస్తున్నాయని, దీనిపై అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారంతో ప్రజలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి.
దుమ్ముగూడెం మండలంలో మూడు మద్యం దుకాణాలకు అనుమతులు ఉండగా, వాటిలో ఒకటి మాత్రమే సక్రమంగా నడుస్తోందని, మిగిలిన వాటి నుంచి బెల్ట్ షాపులకు బహిరంగంగా మద్యం సరఫరా అవుతోందని సమాచారం. ఆర్లగూడెం లోని మద్యం దుకాణం పేరుకు మాత్రమే తెరిచి ఉందని, అక్కడి మద్యం అంతా బెల్ట్ షాపులకే తరలిపోతోందని ఆరోపణలు వస్తున్నాయి.
మండలంలో సుమారు వెయ్యి బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని, అయితే అధికారికంగా కేవలం మూడు మద్యం దుకాణాలు మాత్రమే ఉన్నాయని, అందులోనూ అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో ఉండటం లేదని బాధితులు పేర్కొంటున్నారు. ఈ అక్రమ మద్యం వ్యాపారంతో మహిళలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు.
విషయం తెలిసినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని, వారి ప్రేక్షక పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత బహిరంగంగా అక్రమ మద్యం వ్యాపారం జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దుమ్ముగూడెంలో జరుగుతున్న అక్రమ మద్యం మాఫియా, బెల్ట్ షాపుల నిర్వహణ, అనుమతులు పొందిన మద్యం దుకాణాల నిర్వీర్యంపై సంబంధిత జిల్లా ఎక్సైజ్ అధికారులకు, హైదరాబాద్ విజిలెన్స్ అధికారులకు పూర్తి ఆధారాలతో ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలని బాధితులు కోరుతున్నారు.








