అదనపు కట్నం వేధింపులు, కుటుంబ విభేదాల నేపథ్యంలో భార్యను హత్య చేసి, అత్యాచారం, దోపిడీ జరిగినట్లు చిత్రీకరించేందుకు యత్నించిన భర్తను నిర్మల్ పోలీసులు 24 గంటల్లో అరెస్ట్ చేశారు. ఖానాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఖానాపూర్ మండలం కొత్త తర్లపాడు అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం లభ్యమవడంతో హత్య కేసుగా మారిన ఈ వ్యవహారంలో, నిందితుడైన భర్త నల్ల అరుణ్ తన భార్యను పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహం లభ్యమవడానికి ముందు, ఈ నెల 9న మామడ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది.
పోలీసుల దర్యాప్తులో, నిందితుడు తనపై అనుమానం రాకుండా ఉండేందుకు ఘటనాస్థలాన్ని మార్పులు చేసినట్లు తేలింది. గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేసినట్లు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. మృతురాలి బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్ తదితర వస్తువులను దాచిపెట్టి, మామడ పోలీస్ స్టేషన్లో తప్పుడు మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చినట్లు నిందితుడు అంగీకరించాడు.
ఈ కేసు ఛేదనలో సీసీ కెమెరా ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, శాస్త్రీయ పరిశోధనలు కీలక పాత్ర పోషించాయని పోలీసులు తెలిపారు. నిందితుడు నల్ల అరుణ్‌తో పాటు అతని తల్లిదండ్రులు నల్ల శ్రీనివాస్, నల్ల అదెల్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 5 తులాల బంగారు ఆభరణాలు, మోటార్ సైకిల్, సెల్‌ఫోన్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ సుమారు రూ.8 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ అభినందించారు. మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ శ్రీనివాస్ హెచ్చరించారు.












