గురుగ్రామ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 07
వివాహమై కొద్దిరోజులకే, వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించిన నవవధువు వ్యవహారం హర్యానాలో కలకలం రేపింది. తొలుత ప్రమాదంగా భావించిన ఈ కేసులో, పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.
గురుగ్రామ్ (హర్యానా): వివాహమై కొద్దిరోజులకే, వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించిన ఓ నవవధువు వ్యవహారం హర్యానాలో కలకలం రేపింది. తొలుత ప్రమాదవశాత్తు మరణంగా భావించిన ఈ కేసులో, పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.
జర్తాల్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల మోను, ఇటీవల కసోలి గ్రామానికి చెందిన తన్నును వివాహం చేసుకున్నాడు. అయితే, తన్నుకు ఈ వివాహం ఇష్టం లేదని, వివాహానికి ముందే సోను అనే వ్యక్తితో ఆమెకు ప్రేమ వ్యవహారం ఉందని తెలిసింది. పెళ్లయిన తర్వాత కూడా ప్రియుడితో సంబంధాలు కొనసాగిస్తూ, తమ ప్రేమకు అడ్డుగా ఉన్న మోనును అడ్డు తొలగించుకోవాలని ఇద్దరూ కలిసి పథకం వేశారు.
జూన్ 8వ తేదీ రాత్రి, తన్ను మోనును కసోలి గ్రామానికి రప్పించింది. అదే సమయంలో ప్రియుడు సోను పంపిన హరిఓమ్, అమన్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడ సిద్ధంగా ఉన్నారు. మోను అక్కడికి చేరుకోగానే, అతడిని గట్టిగా పట్టుకుని, ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం, మోను మృతదేహాన్ని అసల్వాస్ కాల్వలో పడేసి, అతని ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కాల్వ ఒడ్డున వదిలి పరారయ్యారు. ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
జూన్ 10న కాల్వలో మోను మృతదేహం లభ్యమైంది. ఎలాంటి గాయాలు లేకపోవడంతో పోలీసులు దీనిని ప్రమాదంగా భావించి కేసు నమోదు చేసుకున్నారు. భర్త మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్నట్లు నటిస్తూ, అంత్యక్రియల్లో పాల్గొని, పుణ్యస్త్రీగా చేయాల్సిన ఆచారాలు పూర్తి చేసింది. దీంతో ఆమె భర్త పోయిన బాధలో ఉందేమోనని అందరూ నమ్మారు.
అయితే, జూన్ 11న పోలీసులకు అప్పగించిన మోను మొబైల్ ఫోన్లో కాల్ హిస్టరీ, చాట్స్ అన్నీ డిలీట్ చేసి ఉండటంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఫోన్ డేటాను రికవరీ చేయించగా, తన్ను మోనును రమ్మని పిలిచినట్లు, ప్రియుడు సోనుతో కలిసి భర్తను వదిలించుకోవడానికి ప్లాన్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. జూన్ 8న మోను అదృశ్యం కావడానికి ముందు తన్నుకు సోను 49 సార్లు కాల్ చేసినట్లు, వారి చాటింగ్స్‌లో హత్యకు సంబంధించిన ప్రణాళికలు ఉన్నట్లు తేలింది. ఈ ఆధారాలను పోలీసులకు అందించినా, మొదట స్థానిక పోలీసులు సీరియస్‌గా తీసుకోలేదు. కుటుంబ సభ్యులు డీఎస్పీ, అనంతరం జిల్లా ఎస్పీని ఆశ్రయించడంతో, ఎస్పీ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగి భార్య తన్నును, హరిఓమ్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో తన్ను నేరం అంగీకరించింది. ప్రియుడు సోను, అమన్ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని డీఎస్పీ సురేందర్ షియోరన్ తెలిపారు.












