ఆన్లైన్ బెట్టింగ్‌ల వ్యసనానికి బానిసైన ఓ బ్యాంక్ మేనేజర్, తన భార్య, స్నేహితుల ఐడీలను ఉపయోగించి నకిలీ బంగారంతో రూ.1.80 కోట్ల మేరకు గోల్డ్ లోన్లను మంజూరు చేసుకున్న ఘటన మెదక్ పట్టణంలో వెలుగుచూసింది.
మెదక్ పట్టణంలోని ఆదర్శ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బ్రాంచ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న యాదం అనిల్, ఆన్లైన్ బెట్టింగ్‌లకు డబ్బు అవసరాల కోసం ఈ అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తన భార్య స్రవంతి, స్నేహితుడు సుబ్రహ్మణ్యం, మరికొందరి ఆధార్, పాన్ కార్డులను సేకరించి, వాటితో 16 నకిలీ ఖాతాలను తెరిచినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ నకిలీ ఖాతాల్లో స్వల్ప మొత్తంలో బంగారం లేదా నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి, వాటిని రికార్డుల్లో అసలైన బంగారు ఆభరణాలుగా నమోదు చేసి, భారీ మొత్తంలో గోల్డ్ లోన్లు మంజూరు చేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ మోసంలో బ్యాంక్ గోల్డ్ లోన్ ఆడిటర్ శ్రీనివాసచారి కూడా సహకరించినట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో, నకిలీ బంగారం ఆధారంగా యాదం అనిల్ రూ.1.49 కోట్ల మేర గోల్డ్ లోన్లు తీసుకున్నట్లు తేలింది. అంతేకాకుండా, ఏటీఎం క్యాష్ డిపాజిట్ వ్యవస్థలో కూడా అక్రమాలకు పాల్పడి మరో రూ.31.35 లక్షలను దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. దీంతో బ్యాంకుకు మొత్తం రూ.1.80 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.
యాదం అనిల్ గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని వాలేరుపాడులో ఏపీజీవీబీ బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు కూడా ఇలాంటి మోసాలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లు సమాచారం. ఆ తర్వాత మెదక్‌లో ఉద్యోగం పొంది, మరింత పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. బ్యాంక్ సీఈఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మేనేజర్ భార్య, స్నేహితుడు, ఆడిటర్‌ను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అనిల్ పరారీలో ఉన్నాడు.












