జమ్మలమడుగు, 2026-06-05
తమను సరిగా చూసుకోవడం లేదని, ప్రాథమిక అవసరాలు తీర్చడం లేదని ఆరోపిస్తూ 88 ఏళ్ల వృద్ధుడు సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్, ఇద్దరు కుమారుల పేర్లపై ఉన్న గిఫ్ట్ డీడ్లను రద్దు చేస్తూ, ఆస్తి హక్కులను వృద్ధుడికే పునరుద్ధరించాలని ఆదేశించింది.
వై.యస్.ఆర్. కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, బొల్లవరం గ్రామానికి చెందిన 88 ఏళ్ల శ్రీ బండి ఆత్మకూరు రామిరెడ్డి, తన ముగ్గురు కుమారుల్లో ఇద్దరైన శ్రీ బండి ఆత్మకూరు నరసింహారెడ్డి, శ్రీ బండి ఆత్మకూరు రామిరెడ్డి పేర్లపై గతంలో చేసిన గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్లను రద్దు చేయాలని సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. తనను కుమారులు సరిగా చూసుకోవడం లేదని, ప్రాథమిక అవసరాలు తీర్చడం లేదని ఆయన ట్రిబ్యునల్‌కు విన్నవించుకున్నారు.
విచారణలో, కుమారులు వృద్ధ తండ్రిని సక్రమంగా పోషించలేదని, ఆహారం, వైద్యం, నివాసం వంటి ప్రాథమిక అవసరాలు అందించలేదని నిర్ధారణ కావడంతో, 16.07.2019న నమోదైన డాక్యుమెంట్ నెం.7524/2019, 7525/2019 నాటి గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్లను సెక్షన్ 23 ప్రకారం చెల్లుబాటు కానివిగా ప్రకటిస్తూ, సంబంధిత ఆస్తులపై హక్కులు, టైటిల్ మరియు ఆసక్తిని పిటిషనర్‌కు పునరుద్ధరించాలని జమ్మలమడుగు సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ ఆదేశించింది.
రిజిస్ట్రేషన్, రెవెన్యూ రికార్డుల్లో అవసరమైన తదుపరి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. వృద్ధుల గౌరవం, సంక్షేమం, భద్రతకు చట్టం రక్షణ కల్పిస్తుందని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఈ తీర్పు వృద్ధులకు చట్టం అండగా ఉంటుందనడానికి నిదర్శనంగా నిలిచింది.












