Bhimgal, 2026-06-05
తెలంగాణ గర్వించదగిన మహాకవి, అభినవ పోతన, కవి చక్రవర్తి వానమామలై వరదాచార్యుల 115వ జయంతి ఉత్సవాన్ని భీంగల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కొరవి గోపరాజు సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని, వరదాచార్యుల జీవితాన్ని, సాహిత్య సేవలను స్మరించుకున్నారు.
భీంగల్ పట్టణానికి చెందిన కొరవి గోపరాజు సాహిత్య సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని శ్రీరామ్ నగర్ రెండో వీధిలో తెలంగాణ గర్వించదగిన మహాకవి, అభినవ పోతన, కవి చక్రవర్తి, విధ్వత్కవి, అభినవ కాళిదాసు, మధురకవి వానమామలై వరదాచార్యుల 115వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత వానమామలై వరదాచార్యుల చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
వరదాచార్యుల జీవిత విశేషాలు
ఈ సందర్భంగా కంకణాల రాజేశ్వర్ మాట్లాడుతూ, వానమామలై వరదాచార్యులు నాటి వరంగల్ జిల్లా హనుమకొండ మండలం మడికొండ గ్రామంలో ఒక రైతు కుటుంబంలో 1912 ఆగస్టు 16వ తేదీన సీతమ్మ, బక్కయ్య శాస్త్రికి జన్మించారని తెలిపారు. వరదాచార్యులు కేవలం 7వ తరగతి వరకే చదువుకున్నప్పటికీ, ఆయన సహజ పాండిత్యాన్ని గుర్తించిన అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేక ఉత్తర్వులతో నిజామాబాద్ జిల్లా దోమకొండ జనతా కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాల అధికారిగా నియమించారు. తర్వాత చెన్నూరు ఉన్నత పాఠశాలకు బదిలీ అయి 13 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి 1972లో పదవీ విరమణ పొందారు.
బహుభాషా పాండిత్యం, సాహిత్య సేవ
నేటి మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్న వరదాచార్యులు, అక్కడ వేద పాఠశాల నెలకొల్పారు. వారికి తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, మరాఠీ, ఆంగ్ల భాషల్లో ప్రత్యేక ఆసక్తితో పాండిత్యం గడించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ నుండి విశారద పట్టా పొందారు. హరికథ గానంలో కూడా ప్రవీణులు. వారి సాహిత్య సేవలకు గుర్తింపుగా కాకతీయ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రధానం చేసింది. దైవభక్తి, దేశభక్తి కలగలిసిన కవిత్వంతో ఆయన చిరకీర్తి పొందారు.
శాసనమండలి సభ్యుడిగా సేవలు
1972లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు వరదాచార్యులను శాసనమండలికి నామినేట్ చేశారు. 1978 వరకు శాసనమండలి సభ్యుడిగా విశిష్ట సేవలు అందించారు. ఆయన 64కు పైగా గ్రంథాలు రచించి, దేశభక్తి గళాన్ని తన కలం ద్వారా వినిపించారు. పాకిస్తాన్, చైనా యుద్ధాల సమయంలో సందర్భోచితంగా అనేక యుద్ధ కవితలు రాశారు. కాశ్మీర్‌ను ఆక్రమించుకోవాలని పాక్ కుతంత్రాలు పన్నినప్పుడు చలించిపోయి, ఆవేశంతో ఖబడ్దార్ పాక్ కాశ్మీర్ మాదేనోయ్ అని నినదించారు.
ఆరోగ్య సమస్యలు, తుది శ్వాస
1950లో వానమామలై క్షయ వ్యాధికి గురై, ఊపిరితిత్తులకు పలుమార్లు శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. ఒక ఊపిరితిత్తిని తొలగించాల్సి వచ్చింది. ఒకే ఊపిరితిత్తితో సుదీర్ఘకాలం జీవించి, 1984 అక్టోబర్ 31న పరమపదించారు.












