రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల కోసం నిర్మల్ పట్టణంలోని ఈద్గా వద్ద అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి తెలిపారు. సోమవారం ఆయన పలువురు కౌన్సిలర్లతో కలిసి ఈద్గా వద్ద జరుగుతున్న ఏర్పాట్ల పనులను పరిశీలించారు.
మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి మాట్లాడుతూ, రంజాన్ పర్వదినాన ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు మున్సిపల్ శాఖ తరఫున ప్రతి సంవత్సరం ఏర్పాట్లు చేయడం ఆనవాయితీగా వస్తోందని, ఈ నేపథ్యంలో ఈసారి కూడా మున్సిపల్ శాఖ ముందస్తుగా పనులు ప్రారంభించిందని తెలిపారు.
ఈద్గా వద్ద శానిటేషన్, టెంట్లు, సౌండ్ సిస్టమ్, కార్పెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సదుపాయాలను కూడా కల్పిస్తున్నామని తెలిపారు.
రంజాన్ పండగ రోజున వేలాది మంది ముస్లిం సోదరులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ప్రార్థనలు నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఇమ్రానుల్లా, ముజహిద్, రఫీ, జకీ, ఇర్ఫాన్, కత్తి నరేందర్, అడప పోశెట్టి, గోపు గోపి, మున్సిపల్ డి.ఈ., శానిటేషన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.










