ఆధునిక సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్రమంగా కనుమరుగై, వ్యక్తి స్వేచ్ఛ పేరుతో ఒంటరి కుటుంబాల ఉధృతి పెరిగిపోతోందని తెలంగాణ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు నేదునూరి కనకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా "కుంటుబడిన కుటుంబం" అనే కవిత ద్వారా కుటుంబ విలువల క్షీణతపై ఆయన స్పందించారు.
ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నంతో పిల్లలకు తాతలు, అమ్మమ్మలు, మామయ్యలు, అత్తమ్మలు, బాబాయిల ఆప్యాయతలు దూరమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మనీ, హోదా, స్టేటస్ పేరుతో బంధుత్వాలు క్రమంగా బలహీనపడుతూ మానవ సంబంధాలు యాంత్రిక జీవనంలో కలిసిపోతున్నాయని తెలిపారు.
అహంకారం, స్వార్థం, ద్వేషం, ప్రతీకార భావనలు పెరిగి పిల్లలకు కూడా అవే వారసత్వంగా మారుతున్నాయని కనకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ విలువలు కుంటుపడి, మానవత్వం అంతరించి, ప్రేమ, త్యాగం, కరుణ, సహనం వంటి గుణాలు కనుమరుగవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
"నీ ఇంటికి వస్తే ఏమిస్తావు.. మా ఇంటికి వస్తే ఏమి తెస్తావు" అనే ఆలోచన సమాజంలో పెరుగుతోందని, బంధాలు భారంగా మారుతున్నాయని ఆయన విమర్శించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలను కాపాడుకోవాలని, "వసుధైక కుటుంబకం" భావనతో సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేదునూరి కనకయ్య పిలుపునిచ్చారు.








