ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ, నిష్పాక్షికంగా సమాచారాన్ని అందించే పత్రికా విలేకరుల సేవలు వెలకట్టలేనివని ముధోల్ వ్యవసాయ పరిశోధన కేంద్ర శాస్త్రవేత్త ఆకుల దినేష్ అన్నారు.
ముధోల్ లోని వ్యవసాయ పరిశోధన కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ సభ్యులను సన్మానించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ప్రతి సమాచారాన్ని చేరవేయడంలో, ప్రభుత్వ పథకాలు, సేవలు ప్రజలకు అందుతున్నాయో లేదో తెలియజేయడంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని ఆయన నొక్కి చెప్పారు.
ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసే మీడియా ప్రతినిధుల సేవలు సమాజ అభివృద్ధికి దోహదపడతాయని ఆకుల దినేష్ పేర్కొన్నారు. నిష్పాక్షిక సమాచారంతో కూడిన వార్తా ప్రసారం ఉన్నంత వరకు సమాజంలో అభివృద్ధి తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు.
సన్మానం అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సునీల్ మాట్లాడుతూ, మండలంలోని అధిక సంఖ్యలో రైతులు ఉన్నందున, వారికి వ్యవసాయంపై నిరంతరాయంగా అవగాహన కల్పించాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా లాభదాయక వ్యవసాయ పద్ధతులను అనుసరించేలా వారిని ప్రోత్సహించాలని కోరారు. దీనికి శాస్త్రవేత్తలు సహకరిస్తామని హామీ ఇచ్చారు.
కమిటీ ఉపాధ్యక్షులు మల్లేష్, రాహుల్ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిరంతరంగా వార్తలను అందిస్తున్నామని, భవిష్యత్తులోనూ ఐక్యంగా సేవలు అందిస్తామని తెలిపారు. పలువురు సభ్యులు, కార్యాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.











