నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైనేజీల్లో క్యారీబ్యాగులు, ప్లాస్టిక్ చెత్త వేయడం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు, దుకాణదారులకు సూచనలు చేశారు.
ప్రజాపాలన–ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమంలో, గ్రామంలో పరిశుభ్రతను కాపాడేందుకు ఇళ్ల వద్ద, దుకాణాల వద్ద చెత్తను సరైన రీతిలో పారవేయాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చని తెలిపారు.
సర్పంచ్ కందూరి సాయినాథ్ మాట్లాడుతూ, డ్రైనేజీల్లో ప్లాస్టిక్ సంచులు వేయడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇళ్లలోని చెత్తను సంచుల్లో సేకరించి, గ్రామపంచాయతీ చెత్త ట్రాక్టర్ వచ్చినప్పుడు అందులో వేయాలని ప్రజలకు సూచించారు.
పంచాయతీ కార్యదర్శి జాదవ్ మాధవ్, కారోబారి బిచ్చేవార్ ప్రకాష్ తదితరులు మాట్లాడుతూ, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో దుకాణ యజమానులు దేవరశెట్టి శ్రీనివాస్, రాజారాం వంటివారు పాల్గొన్నారు. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.


