మండలంలోని ఇప్పచెల్మ గ్రామ గిరిజనులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని లబ్ధిదారులు ఆరోపించారు. ఈ విషయమై శనివారం వారు తహసిల్దార్ సంధ్యారాణికి వినతి పత్రాన్ని అందజేసి, తమ గోడు వెళ్లబోసుకున్నారు.
50 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడే జీవిస్తున్న తమకు, ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇప్పించాలని లబ్ధిదారులు కోరారు. అటవీశాఖ అధికారుల చర్యల వల్ల ఇళ్ల నిర్మాణం నిలిచిపోయిందని వారు తెలిపారు.
గ్రామ సర్పంచ్ గణేష్ మాట్లాడుతూ, గిరిజనుల సమస్యలను తహసిల్దార్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూడాలని ఆయన కోరారు.
గ్రామ పటేల్ నాగరావు పటేల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గిరిజనుల నివాసయోగ్యమైన ఇళ్ల నిర్మాణానికి అడ్డంకులు తొలగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్థులు బలరాం, దేవ్ రావు, అమృత్, లక్ష్మన్, విష్ణుతో పాటు పలువురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.











