ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు కోరుట్ల నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పలు గ్రామాల్లో పంచాయతీలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్, గంజాయి విక్రయాలు, బహిరంగ మద్యపానం, ధూమపానం వంటి వాటిపై నిషేధాలు విధిస్తూ, అనారోగ్యానికి కారణమయ్యే అంశాలపై దృష్టి సారిస్తున్నాయి.
సంగెం గ్రామంలో క్యాన్సర్ కేసుల పెరుగుదలను అరికట్టేందుకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించారు. నిబంధనలు అతిక్రమిస్తే రూ.5,000 వరకు జరిమానా విధించనున్నారు. ఆలయాలు, శుభకార్యాల్లో ప్లాస్టిక్‌కు బదులుగా స్టీల్, ఆకుల పళ్లాలను వాడాలని నిర్ణయించారు.
కథలాపూర్ మండలంలో గంజాయి విక్రయాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. గంజాయి అమ్మితే రూ.20,000 జరిమానా, సమాచారం ఇచ్చిన వారికి రూ.5,000 బహుమతి ప్రకటించారు. ఈ చర్యల ద్వారా యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు.
అయిలాపూర్ గ్రామం బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, ధూమపానం, బహిరంగ మల విసర్జనపై నిషేధం విధించింది. ప్రజలు తిరిగే చోట్ల ప్లాస్టిక్, గాజు సీసాలు పడేయకుండా కఠిన ఆదేశాలు జారీ చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
కొన్ని గ్రామాల్లో కల్తీ ఆహారం వల్ల పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని గుర్తించి, ఐస్‌క్రీమ్ బండ్లకు కూడా అనుమతి నిరాకరించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు ఈ రకమైన కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.












