దేశంలో పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరలు త్వరలో పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై ఒత్తిడి పెరిగిందని, ధరల పెంపు అనివార్యమని పేర్కొంటున్నాయి.
ప్రభుత్వ వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం, పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు సుమారు రూ.4-5, గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.40-50 వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. 2022 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒకేసారి పెట్రోల్, డీజిల్ ధరలను ఈ స్థాయిలో పెంచడం ఇదే మొదటిసారి కానుంది.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. అనేక దేశాలు చమురు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై ఒత్తిడి పెరిగిందని, ధరలు పెంచడం తప్పనిసరి అని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇటీవల, ఎన్నికలు ముగిసిన వెంటనే ధరల పెంపు ఉండదని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అయితే, వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా రూ.993 పెంచింది. ఇప్పుడు పెట్రోల్ ధరల పెంపునకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు ఉత్పత్తి తగ్గడం, రవాణాకు ఆటంకాలు ఏర్పడటం, బ్యారెల్ చమురు ధర భారీగా పెరగడం వంటి కారణాలతో దేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయని ప్రభుత్వం వివరిస్తోంది.
ధరలు పెంచకపోతే కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుందని, అయితే సబ్సిడీలు పెంచడం లేదా పన్నులు తగ్గించడం ద్వారా వినియోగదారులపై భారాన్ని కొంతమేర తగ్గించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం మరో 5-7 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ధరలు ఇలాగే పెరిగితే, సాధారణ ప్రజలపై, వ్యాపార సంస్థలపై, ప్రజా రవాణా, సరుకు రవాణా రంగాలపై అధిక భారం పడనుంది.








