జర్నలిజం ముసుగులో కొందరు మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు యూట్యూబ్ ఛానళ్లను ఉపయోగిస్తున్నారని, ఇది రాష్ట్రంలో సామాజిక ఐక్యతకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని సామాజిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కొంతమంది మతోన్మాద శక్తులు యూట్యూబ్ వేదికగా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, ఇది రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తూ సామాజిక ఐక్యతను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇటీవల మేడారం జాతరలో ఒక చిరు వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని యూట్యూబ్ ప్రతినిధులు అతనిపై దాడి చేసి, మతాన్ని ప్రస్తావిస్తూ అవమానించిన సంఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. వ్యాపార నాణ్యతపై సమస్యలుంటే అధికారులను సంప్రదించకుండా మతాన్ని అడ్డుపెట్టుకోవడం అనైతికమని పలువురు పేర్కొన్నారు.
కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఇంటర్వ్యూల పేరుతో హద్దులు దాటి, దూషణలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు పాల్పడుతున్నాయని, కేవలం వ్యూస్ కోసం మతపరమైన అంశాలను వివాదాస్పదం చేస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది జర్నలిజం విలువలకు విరుద్ధమని అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి చర్యలు ప్రజల మధ్య విభేదాలు పెంచి, సామాజిక శాంతికి భంగం కలిగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంబంధిత యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి బాధ్యతాయుతమైన మీడియాకు మద్దతు ఇవ్వాలని సూచిస్తున్నారు.

