చిన్నతనంలోనే సరైన పోషకాహారం అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని మిర్యాలగూడ మునిసిపల్ వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్ అన్నారు. మిర్యాలగూడలో పోషణ్ పక్వాడ, ఈసీసీఈ డే గ్రాడ్యుయేషన్ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి.
ఐసిడిఎస్ మిర్యాలగూడ అర్బన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, చిన్నారులు, గర్భిణులు, బాలింతలలో పోషకాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వైస్ చైర్మన్ పేర్కొన్నారు. స్థానిక అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం ప్రాముఖ్యతను వివరించారు.
చిన్నారుల ఎదుగుదలకు అవసరమైన తృణధాన్యాలు, పప్పు దినుసులు, ఆకుకూరలు, పండ్లతో కూడిన ప్రదర్శనను ఆమె పరిశీలించారు. తక్కువ ఖర్చుతో లభించే పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాల్లో ముందస్తు ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న చిన్నారుల కోసం ఈసీసీఈ డే, గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహించారు. ఒకటవ తరగతిలోకి అడుగుపెడుతున్న చిన్నారులకు శిరీష పట్టాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. చిన్నారులు గ్రాడ్యుయేషన్ గౌన్లు, టోపీలు ధరించి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
బాల్యదశలో అంగన్వాడీలు అందించే పునాది విద్య పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఎంతో కీలకమని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ సిబ్బంది, తల్లిదండ్రులు, చిన్నారులు పాల్గొన్నారు.










