హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు, ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. జూన్ 2వ తేదీ నుంచి MMTS రైళ్లలో ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీ, కాలుష్యాన్ని అరికట్టే లక్ష్యంతో ఈ ప్రతిపాదన ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, MMTS రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణాన్ని కల్పించడం ద్వారా ప్రజలు ప్రైవేట్ వాహనాల వాడకాన్ని తగ్గించి, ప్రజా రవాణాను ఆశ్రయిస్తారని భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, జూన్ 2 నుంచి ఏడాది పాటు ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రతిపాదనపై ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో చర్చలు జరిగినట్లు సమాచారం. రైల్వే శాఖకు రావాల్సిన ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రస్తుతం MMTS రైళ్ల ద్వారా రైల్వే శాఖకు ఏడాదికి సుమారు రూ. 10 కోట్ల ఆదాయం వస్తుండగా, ఈ ఉచిత పథకం అమలుతో ఆ ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భర్తీ చేయనుంది. దీనిపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు ప్రభుత్వం అధికారికంగా లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలుపై ప్రభుత్వ నిర్ణయం తుది దశకు చేరుకుంది.












