జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, లక్ష్మణచందా మండలంలోని పలు గ్రామాలలో జరుగుతున్న భూముల రీ సర్వే, సర్వే తీరును పరిశీలించి, పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సోమవారం సాయంత్రం కలెక్టర్ ముని పెల్లి గ్రామంలో రెవెన్యూ అధికారులు చేపట్టిన రీ సర్వే తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడుతూ, సర్వేకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలోని కొన్ని గ్రామాలకు రెవెన్యూ మ్యాపులు అందుబాటులో లేకపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, రీ సర్వే ద్వారా గ్రామాల రెవెన్యూ మ్యాపులను సిద్ధం చేయాలని సూచించారు. అధునాతన కొలతల యంత్రాలను ఉపయోగించి, నిర్ణీత గడువులోగా సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
భూముల సర్వే వల్ల రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ అన్నారు. ఉన్నతాధికారులు సర్వే పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం చామన్ పల్లి గ్రామంలోని సర్వేను పరిశీలించి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్, డిఆర్ఓ రాథోడ్ రమేష్, ఆర్డీవో దేవీదాస్, తహసిల్దార్ సరిత, డిప్యూటీ ఇన్స్ పెక్టర్ విటల్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

