కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, 'వికసిత్ భారత్- గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీ వికమిషన్ గ్రామీణ' (వీబీ-జీరామ్జీ) చట్టం- 2025ను తీసుకురానుంది. ఈ కొత్త చట్టం జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది.
దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ప్రతిపాదించిన వీబీ-జీరామ్జీ చట్టం ముసాయిదా నిబంధనలను శనివారం విడుదల చేసింది. దీనిపై ప్రజల నుంచి, నిపుణుల నుంచి అభిప్రాయాలను స్వీకరించేందుకు జూన్ 21 వరకు గడువు ఇచ్చింది.
ముసాయిదా ప్రకారం, ఈ కొత్త చట్టం కింద అర్హులైన కూలీలకు ఏడాదికి కల్పించే పనిదినాల సంఖ్య 100 నుంచి 125కి పెంచబడింది. కూలీలు అడిగిన 15 రోజుల్లోగా పని కల్పించడం తప్పనిసరి. ఒకవేళ పని కల్పించడంలో ఆలస్యం జరిగితే, ఆలస్యమైన మొదటి 30 రోజులకు రోజువారీ వేతనంలో పావు వంతు, ఆ తర్వాత కూడా పని కల్పించకపోతే సగం వేతనం భృతిగా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ చట్టం అమలును పర్యవేక్షించడానికి కేంద్ర స్థాయిలో 'సెంట్రల్ గ్రామీణ్ రోజ్గార్ గ్యారంటీ కౌన్సిల్' ఏర్పాటు చేయబడుతుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, నీతి ఆయోగ్, కేంద్రమంత్రులు, రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన స్టీరింగ్ కమిటీ దీనికి మార్గనిర్దేశం చేస్తుంది. పథకం అమలు, పర్యవేక్షణ, అర్హుల గుర్తింపు వంటి కీలక బాధ్యతలను ఈ కౌన్సిల్ నిర్వహిస్తుంది.
ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో ఈ-కేవైసీ (KYC) ప్రక్రియ పూర్తి చేసుకున్న వారందరూ కొత్త చట్టం కింద లబ్ధిదారుల జాబితాలో చేర్చబడతారు. ఈ చట్టం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ఉపాధి భద్రతను పెంచడం వంటి లక్ష్యాలను సాధించాలని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది.












