రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే, శాసనమండలి ఎన్నికల నిర్వహణపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో తేదీలపై స్పష్టత రావాల్సి ఉంది. ఫిబ్రవరి 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సుమారు 15 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగం, అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది.
ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఫిబ్రవరి 28న శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే, శాసనమండలి ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంలో జరుగుతున్న చర్చల నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల తేదీలపై తుది స్పష్టత రావాల్సి ఉంది.
మార్చి 10వ తేదీలోపు శాసనమండలి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి, ఆ తర్వాత బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 23న జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన విజయాల నేపథ్యంలో శాసనమండలి ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి భావించారు. అయితే, మార్చి 14వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఎన్నికల ప్రక్రియ పరీక్షలకు ఆటంకం కలిగించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎన్నికల ప్రక్రియను మార్చి 10లోపు పూర్తి చేయగలిగితే పదో తరగతి పరీక్షలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఎన్నికలను ఏప్రిల్కు వాయిదా వేయాలా లేక పరీక్షలకు ఆటంకం కలగకుండా మార్చి 10లోపు పూర్తి చేయాలా అనే అంశాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికలను వాయిదా వేస్తే, ఫిబ్రవరి 26 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.


