జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న నకిలీ సంస్థలపై కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది.
ఎన్హెచ్ఆర్సీ పేరును దుర్వినియోగం చేస్తూ, తమకు ప్రభుత్వ గుర్తింపు ఉందని ప్రచారం చేసుకుంటున్న నకిలీ సంస్థలపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలలో గందరగోళాన్ని నివారించేందుకు, కమిషన్ పట్ల నమ్మకాన్ని కాపాడేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
ఢిల్లీలో 'నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్హెచ్ఆర్సీ)' పేరుతో రిజిస్టర్ అయిన ఒక ఎన్జీవో, ప్రభుత్వ శాఖల గుర్తింపు ఉందని ప్రచారం చేసుకుంటున్నట్లు కమిషన్ దృష్టికి వచ్చింది. ఈ సంస్థ కార్యకలాపాలు, ముఖ్యంగా కర్ణాటకలో విస్తరించి ఉన్నాయని గుర్తించారు.
ఈ వ్యవహారంపై సుమోటోగా విచారణ చేపట్టిన కమిషన్, ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలు నిధుల దుర్వినియోగానికి దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది.
నకిలీ సంస్థల రిజిస్ట్రేషన్లను రద్దు చేయడంతో పాటు, తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రత్యేకించి, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల అధికారులు, సదరు నకిలీ సంస్థపై తీసుకున్న చర్యలపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని కోరింది.


